నిజమా? లేక అనుభవమా?మనకు కనిపించే ప్రపంచం గురించి ఒక విసృత పరిశీలన
నిజమా? లేక అనుభవమా?మనకు కనిపించే ప్రపంచం గురించి ఒక విసృత పరిశీలన
డా. బి.ఎస్. చక్రవర్తి
మనిషి ఎప్పటినుంచో ఒక ప్రశ్నతో జీవిస్తున్నాడు.
మనము చూస్తున్న ఈ ప్రపంచం నిజంగానే ఉందా? లేక మన అనుభవం ద్వారా మాత్రమే రూపం దాల్చుతున్నదా?
ఇటీవల ఈ ప్రశ్న మళ్లీ ప్రాధాన్యం పొందింది. కారణం ఒక చిన్న కానీ అద్భుతమైన ప్రయోగం. దానిని double-slit experiment అంటారు.
ఈ ప్రయోగం సాదాసీదాగా కనిపించినా, అది మనకు ఒక అసౌకర్యకరమైన నిజాన్ని చూపిస్తుంది. మనం “నిజం” అని భావిస్తున్నది అంత సులభం కాదు.
ఒక కణాన్ని రెండు చిన్న చీలికల( slits) ద్వారా పంపితే ఏమవుతుంది?
మనము దాన్ని గమనించకుండా వదిలేస్తే, అది అలలా(waves) ప్రవర్తిస్తుంది. ఒకే కణం రెండు మార్గాల్లో ప్రయాణించినట్లుగా interference pattern ఏర్పడుతుంది.
కానీ అదే కణం ఏ చీలిక ద్వారా వెళ్లిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ అలల లక్షణం మాయమవుతుంది. అది ఒక్క మార్గం మాత్రమే తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.
అదే కణం, రెండు విధాలుగా ప్రవర్తించడం మనలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది “గమనించడం”( observation)అంటే ఏమిటి అన్నది.
ఇది మన కళ్లతో చూడడం కాదు.
ఇది మనసు లేదా అవగాహనతో సంబంధం కూడా కాదు.
ఏదైనా interaction జరిగితే, అంటే ఆ కణం తన గురించి సమాచారం బయటకు ఇస్తే, అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది.
అంటే ప్రపంచం మనం చూస్తే మారడం కాదు. ప్రపంచం తాకినప్పుడు( interaction) రూపం దాల్చుతుంది.
ఈ భావనను చాలామంది simulation తో పోలుస్తారు.
వీడియో గేమ్‌లలో మనకు కనిపించని భాగాలు పూర్తిగా రూపొందించబడవు. మనం చూసినప్పుడు మాత్రమే అవి కనిపిస్తాయి.
అదే విధంగా, quantum ప్రపంచంలో కూడా గమనించకపోతే నిర్దిష్టత ఉండదనే భావన simulation లాగా అనిపిస్తుంది.
కానీ ఈ పోలిక పూర్తిగా సరైనది కాదు.
మనకు తెలిసిన భౌతిక శాస్త్రం ప్రకారం, ప్రపంచం నిరంతరంగా తన గమనాన్ని కొనసాగిస్తుంది. అది ఎవరో చూసే వరకు ఆగి ఉండదు. ఎక్కడా “render అవుతోంది” అన్న సంకేతాలు కనిపించలేదు.
అయితే ఈ ప్రయోగం మనకు చెప్పేది ఏమిటి?
ప్రపంచం ముందుగానే పూర్తిగా నిర్ణయించబడినది కాదు. అది అవకాశాల ( probabilities)రూపంలో ఉంటుంది. interaction జరిగినప్పుడు, వాటిలో ఒకటి స్పష్టమైన అనుభవం(reality) గా మారుతుంది.
ముందు అవకాశాలు ఉంటాయి. తర్వాత అవి అనుభవంగా మారుతాయి.
ఇక్కడ మన పాత్ర చాలా ఆసక్తికరంగా మారుతుంది.
మనము బయట నిలబడి చూస్తున్న వాళ్లు కాదు. మనము ఈ ప్రక్రియలో భాగం.( participants)
మన చర్యలు, (actions)మన సంబంధాలు,( relations)మన నిర్ణయాలు( decisions)— ఇవన్నీ కలిసి ప్రపంచాన్ని రూపుదిద్దుతున్నాయి.
అంటే ప్రపంచం మనకు బయట ఉన్న ఒక స్థిరమైన వస్తువు కాదు. అది మనతో కలిసి ప్రవహించే ఒక ప్రక్రియ.
ఇప్పుడు ప్రశ్న మళ్లీ వస్తుంది.
ఇది నిజమా? లేక simulationనా?
ఈ ప్రశ్నకు ఇప్పటివరకు ఖచ్చితమైన సమాధానం లేదు.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. మన అనుభవం( reality) నిజమే. మనం అనుభవించే సంతోషం, బాధ, ప్రేమ, బాధ్యత — ఇవన్నీ మన జీవితాన్ని అర్థవంతంగా మారుస్తాయి.
కాబట్టి ఒక లోతైన మార్పు మన ఆలోచనలో రావచ్చు.
మనము “ఇది నిజమా కాదా” అని అడగడం కంటే, “ఈ ప్రపంచం నా ద్వారా ఏమి వ్యక్తం కావాలని చూస్తోంది” అని అడగడం ప్రారంభిస్తే, మన దృష్టి మారుతుంది.
ప్రపంచం మనం చూస్తే మాత్రమే ఉండే దృశ్యం కాదు.
మనము పాల్గొనగానే రూపం దాల్చే అనుభవం.
ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం.
ఈ విశ్వం, ప్రపంచం మనకు కనిపించేది కాదు.
మనతో కలిసి జీవించేది.
Good
ReplyDelete