ఒక్క రోజులో జీవితాన్ని మార్చగలమా? Dr B.S.Chakravarthy

 

ఒక్క రోజులో జీవితాన్ని మార్చగలమా?

Dan Koe రాసిన “How to Fix Your Entire Life in 1 Day” చదివిన తరువాత కొన్ని ఆలోచనలు

డా. బి. ఎస్. చక్రవర్తి



ప్రతి కొత్త సంవత్సరం మనం ఒక చిన్న ఆశతో మొదలుపెడతాం.

కొత్త డైరీ కొనుక్కుంటాం.
మొదటి తెల్లని పేజీ తెరుస్తాం.
ఈ సంవత్సరం మనం ఎలా మారిపోవాలో రాసుకుంటాం.

బరువు తగ్గాలి.
రోజూ నడవాలి.
ఎక్కువ చదవాలి.
తక్కువ ఖర్చు చేయాలి.
కొత్తది నేర్చుకోవాలి.
కోపం తగ్గించుకోవాలి.
ఉదయాన్నే లేవాలి.
ఫోన్ తక్కువ చూడాలి.

మొదటి వారం బాగానే ఉంటుంది.

రెండో వారం కూడా ఏదో నెట్టుకొస్తాం.

ఫిబ్రవరి వచ్చేసరికి డైరీ డ్రాయర్‌లోకి వెళ్తుంది. షూస్ మళ్లీ మూలకు చేరతాయి. పాత జీవితం నిశ్శబ్దంగా తిరిగి వచ్చి మన పక్కన కూర్చుంటుంది.

అప్పుడు మనం ఒక మాటతో తీర్పు చెప్పేస్తాం.

“నాకు discipline లేదు.”

కానీ నిజంగా సమస్య discipline లోనే ఉందా?

లేక మనం పనులను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం గానీ, ఆ పనులను చేసే మనిషిని మార్చడానికి ప్రయత్నించడం లేదా?

Dan Koe రాసిన How to Fix Your Entire Life in 1 Day చదివినప్పుడు నాకు మిగిలిపోయిన ప్రధానమైన ప్రశ్న ఇదే.

పేరు కొంచెం అతిశయంగా అనిపిస్తుంది.

ఒక్క రోజులో జీవితం మొత్తం ఎలా మారుతుంది?

ముప్పై కిలోల బరువు ఒక్క రోజులో తగ్గదు. ఒక వ్యాపారం ఒక్క రోజులో నిర్మించలేం. ఒక పుస్తకం రాయలేం. చెడిపోయిన సంబంధం ఒక్క రోజులో బాగుపడదు. ఇరవై సంవత్సరాల అలవాటు ఉదయం మొదలుపెట్టి రాత్రికి మాయం కాదు.

కానీ ఒక్క రోజులో ఇంకొకటి జరగవచ్చు.

మనం ఎటు వెళ్తున్నామో గుర్తించవచ్చు.

కొన్నిసార్లు వేగం పెంచడం కంటే దిశ మార్చడం చాలా ముఖ్యం.

విత్తనం మారకుండా పండు మారదు

నాకు మామిడి పండ్లు కావాలి అనుకుందాం.

నేను వేప విత్తనం నాటాను.

రోజూ ఉదయం లేచి నీళ్లు పోస్తున్నాను. ఎరువు వేస్తున్నాను. పురుగులు రాకుండా మందు వేస్తున్నాను. మామిడి సాగు గురించి పుస్తకాలు చదువుతున్నాను.

ఇంకా discipline పెంచుకోవాలని ఉదయం ఐదు గంటలకే లేచి నీళ్లు పోస్తున్నాను.

కానీ మామిడి పండ్లు రావడం లేదు.

సమస్య నా కష్టంలో లేదు.

సమస్య విత్తనంలో ఉంది.

మన జీవితంలో కూడా చాలాసార్లు ఇదే జరుగుతుంది.

“ఆరోగ్యంగా ఉండాలి” అంటాం.

కానీ మన రోజు మొత్తం కదలిక లేకుండా, నిద్రకు సమయం లేకుండా, ఆహారానికి నియమం లేకుండా, ఒత్తిడికి హద్దు లేకుండా తయారు చేసుకుంటాం.

“రాయాలి” అంటాం.

కానీ ఖాళీగా దొరికిన ప్రతి ఐదు నిమిషాలూ ఫోన్‌కే ఇచ్చేస్తాం.

“ప్రశాంతంగా ఉండాలి” అంటాం.

కానీ ప్రతి notification, ప్రతి వాదన, ప్రతి అభిప్రాయం మన మెదడులోకి అనుమతి లేకుండా ప్రవేశించనిస్తాం.

మనకు కావాల్సింది ఒక పండు.

రోజూ నాటుతున్నది ఇంకో విత్తనం.

అందుకే ప్రశ్న:

“నేను ఏమి సాధించాలి?”

అన్నదానికంటే ముందు,

“అది సహజంగా సాధించే వ్యక్తి ఎలా జీవిస్తాడు?”

అని అడగాలి.

మాటలు కాదు — కాళ్లు ఎటు వెళ్తున్నాయో చూడండి

ఒక మనిషి పదేళ్లుగా,

“ఈ ఉద్యోగం నాకు అసలు నచ్చదు”

అంటూ ఉండవచ్చు.

కానీ ఉద్యోగం మాత్రం వదలడు.

మనం వెంటనే “ధైర్యం లేదు” అని అనుకోవచ్చు.

కానీ ఆ ఉద్యోగం అతనికి ఇంకేదో ఇస్తుండవచ్చు.

నెల జీతం.
భద్రత.
సమాజంలో ఒక స్థానం.
కుటుంబం అంగీకారం.
కొత్తది ప్రయత్నించి విఫలమయ్యే ప్రమాదం నుంచి రక్షణ.

అంటే అతను ఉద్యోగాన్ని మాత్రమే పట్టుకుని ఉండడం లేదు.

ఆ ఉద్యోగం వెనుక ఉన్న భద్రతను పట్టుకుని ఉన్నాడు.

Procrastination కూడా కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది.

పుస్తకం పూర్తి చేయకపోతే ఎవ్వరూ దాన్ని తిరస్కరించలేరు.

Application పంపకపోతే selection రాలేదనే బాధ ఉండదు.

ప్రాజెక్టు మొదలుపెట్టకపోతే,

“నిజంగా ప్రయత్నించి ఉంటే నేను చేసేవాడిని”

అనే అందమైన భ్రమను జీవితాంతం కాపాడుకోవచ్చు.

అందుకే ఒక అలవాటు మారడం లేదంటే,

“నేను దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నాను?”

అనే ప్రశ్నతో పాటు,

“ఈ అలవాటు నన్ను దేనినుంచి రక్షిస్తోంది?”

అని కూడా అడగాలి.

ఆ తరువాత మరింత కష్టమైన ప్రశ్న:

“ఆ రక్షణ కోసం నేను చెల్లిస్తున్న ధర ఎంత?”

మనకు ప్రపంచం కనిపించదు — మనకు అవసరమైన ప్రపంచం కనిపిస్తుంది

ఒక pediatrician గా నేను emergency room లో ఒక sick child ని చూస్తే కొన్ని విషయాలు వెంటనే నా కంటికి కనిపిస్తాయి.

Breathing.
Colour.
Sensorium.
Perfusion.
Respiratory effort.

అదే పిల్లవాడిని పక్కన ఉన్న తల్లి చూస్తోంది.

పిల్లవాడు ఒక్కడే.

గది అదే.

వెలుతురు అదే.

కానీ మేమిద్దరం చూస్తున్నది ఒకటే కాదు.

ఎందుకంటే training మనం ఏది గమనించాలో మార్చేస్తుంది.

Goals కూడా అలాగే చేస్తాయి.

ఒక particular car కొనాలని నిర్ణయించుకున్న రోజు నుంచి అదే model రోడ్డుమీద ప్రతిచోటా కనిపించడం మొదలవుతుంది.

నిన్న ఆ కార్లు లేవా?

ఉన్నాయి.

కానీ మనకు అవి ముఖ్యమైనవి కావు.

అందుకే goal అనేది భవిష్యత్తులో ఉన్న destination మాత్రమే కాదు.

ఈరోజు మనం ఏమి చూడాలో నిర్ణయించే lens కూడా.

Status లక్ష్యమైతే rank కనిపిస్తుంది.

Approval లక్ష్యమైతే ఇతరుల ముఖాల్లో approval, rejection కనిపిస్తాయి.

Learning లక్ష్యమైతే mistake కూడా information గా కనిపిస్తుంది.

Service లక్ష్యమైతే inconvenience కూడా opportunity గా కనిపించవచ్చు.

అత్యంత ప్రమాదకరమైన వాక్యం — “నేను ఇలాంటి వాడిని”

“నాకు maths రాదు.”
“నేను technology person కాదు.”
“నేను risk తీసుకోను.”
“ఈ వయసులో నేర్చుకోలేను.”
“నేను ఇంతే.”

మొదట ఇవి descriptions మాత్రమే.

క్రమంగా అవి identities అవుతాయి.

తర్వాత ఆ identity మనకు ఆదేశాలు ఇవ్వడం మొదలుపెడుతుంది.

ఒక పిల్లవాడికి mathematics కష్టంగా అనిపించింది.

మొదట:

“Maths కొంచెం కష్టం.”

తర్వాత:

“నాకు maths రాదు.”

చివరికి:

“నేను maths person కాదు.”

అక్కడ ఒక తలుపు మూసుకుపోతుంది.

Mathematics మారలేదు.

ఒక temporary experience, permanent identity అయిపోయింది.

Medicine నాకు labels గురించి ఒక ముఖ్యమైన విషయం నేర్పింది.

Diagnosis చాలా అవసరం.

అది information ని organise చేస్తుంది. Investigation ని guide చేస్తుంది. Treatment కి దారి చూపుతుంది.

కానీ diagnosis కంటే child ఎప్పుడూ పెద్దవాడు.

Autism ఉన్న పిల్లవాడు “autism” కాదు.

Epilepsy ఉన్న పిల్లవాడు “epilepsy” కాదు.

Cerebral palsy ఉన్న పిల్లవాడు case sheet లో రాసిన మూడు పదాలు కాదు.

Map ఉపయోగపడుతుంది.
కానీ map అనేది territory కాదు.
Diagnosis అనేది child కాదు.

మన గురించి మనం పెట్టుకున్న labels విషయంలో కూడా ఇదే జాగ్రత్త అవసరం.

“నేను ఇలాంటి వాడిని”

అనేది శాశ్వత సత్యం కాకపోవచ్చు.

ఇప్పటివరకు రాసిన chapter కి అది ఒక description మాత్రమే కావచ్చు.

Chapters ముగుస్తాయి.

మనలో నిజంగా “మనది” ఎంత?

Success అంటే ఏమిటో మనకు ఎవరు చెప్పారు?

ఎందుకు ఒక profession respectable గా, ఇంకొకటి risky గా కనిపిస్తుంది?

ఎందుకు particular salary, house, designation, institution, social position మనకు success లా అనిపిస్తాయి?

Genes మాత్రమే మనకు వారసత్వంగా రావు.

Expectations కూడా వస్తాయి.

కొన్ని parents నుంచి.

కొన్ని school నుంచి.

కొన్ని religion నుంచి.

కొన్ని society నుంచి.

కొన్ని profession నుంచి.

ఇప్పుడు కొన్ని algorithms నుంచి కూడా.

ఇవి అన్నీ తప్పు కాదు.

మనకు maps అవసరం.

కానీ adulthood లో ఎప్పుడో ఒకసారి ఆ map ని table మీద పెట్టి చూడాలి.

“ఈ belief నిజంగా నాదేనా?”

“నేను దీన్ని ఎప్పుడైనా పరీక్షించానా?”

“ఇప్పటికీ ఇది territory ని సరిగ్గా చూపిస్తుందా?”

Science లో నాకు నచ్చే ఒక లక్షణం ఉంది.

ఏ conclusion కీ permanent immunity ఉండదు.

కొత్త evidence వస్తే మన conclusion మారాలి.

“ప్రస్తుతం నాకు తెలిసిన evidence ప్రకారం…”

అనే వాక్యంలో ఒక intellectual humility ఉంది.

జీవితంలో కూడా ఆ తలుపు తెరిచి ఉంచితే బాగుంటుంది.

జీవితం బాణంలా కాదు — ఓడలా ఉంటుంది

ఒక ఓడ సముద్రం దాటుతోంది అనుకుందాం.

Destination ఉంది.

ఓడ బయలుదేరింది.

గాలి కొంచెం తూర్పుకు తోసింది.

Navigator చూసి correction చేశాడు.

Current పడమరకు తీసుకెళ్లింది.

మళ్లీ correction.

వాతావరణం మారింది.

మళ్లీ correction.

ప్రయాణంలో చాలా సమయం ఆ ఓడ technically “off course” లోనే ఉండవచ్చు.

కానీ అదే ఓడ చివరకు harbour చేరుతుంది.

ఎందుకంటే అది తప్పిపోలేదు కాబట్టి కాదు.

తప్పిన ప్రతిసారీ తన దిశను సరిచేసుకుంది కాబట్టి.

Goal → Action → Feedback → Correction → Action again.

Failure ని కూడా ఇలా చూడగలిగితే?

Failure అంటే,

“నువ్వు పనికిరావు”

అని కాదు.

కొన్నిసార్లు అది కేవలం:

“మూడు degrees దారి తప్పావు.”

అంతే.

Information.

మన navigation system ఎంత దయగా ఉంటుందో గమనించండి.

Wrong turn తీసుకున్నప్పుడు అది:

“నీకు బుద్ధి లేదా? మళ్లీ తప్పు చేశావు. నీతో హైదరాబాద్ చేరడం అసాధ్యం!”

అని అనదు.

ఒక్క మాట చెబుతుంది.

Recalculating...

ఎంత గొప్ప మాట!

Shame లేదు.

Character assassination లేదు.

గత తప్పుల autobiography లేదు.

కొత్త information వచ్చింది.

కొత్త route తీసుకుంది.

మన జీవితంలో కూడా కొన్నిసార్లు motivation కంటే recalculation అవసరం.

కానీ ప్రతి Goal చేరాల్సినదేనా?

ఇక్కడ నేను modern self-help philosophy తో కొంచెం విభేదిస్తాను.

మనకు కావలసింది సాధించగలగడం intelligence లో ఒక భాగం కావచ్చు.

Agency ముఖ్యం.

Learning ముఖ్యం.

Persistence ముఖ్యం.

Feedback తీసుకుని మారడం చాలా ముఖ్యం.

కానీ ఇంకొక intelligence కూడా ఉంది.

మనకు కావాలనిపిస్తున్నది నిజంగా కావాల్సిందేనా అని ప్రశ్నించగలగడం.

ఒక నిచ్చెన ఉంది.

మీరు చాలా వేగంగా ఎక్కుతున్నారు.

Sleep sacrifice చేశారు.

Family time sacrifice చేశారు.

Health sacrifice చేశారు.

Networking నేర్చుకున్నారు.

Strategy నేర్చుకున్నారు.

Productivity నేర్చుకున్నారు.

అందరికంటే వేగంగా పైకి చేరారు.

55 సంవత్సరాల వయసులో top కి చేరి చూస్తే—

ఆ నిచ్చెన ఆనించి ఉన్న గోడ మీదకి మీరు ఎప్పుడూ ఎక్కాలని అనుకోలేదని తెలిసింది.

అది intelligence అవుతుందా?

తప్పు దిశలో వేగంగా వెళ్లడం కూడా efficiency కావచ్చు.

Wisdom కాదు.

అందుకే,

“అక్కడికి ఎలా చేరాలి?”

అనే ప్రశ్నకు ముందు అప్పుడప్పుడు,

“నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నాను?”

అని అడగాలి.

ఒక రోజు — మనసును తవ్వి చూడటానికి

ఇక్కడ Dan Koe సూచించిన one-day exercise నాకు ఆసక్తికరంగా అనిపించింది.

ఒక్క రోజులో జీవితం మారిపోతుందని కాదు.

కానీ మన ordinary day దాచిపెట్టిన patterns, ఒక deliberately interrupted day లో కనిపించవచ్చు.

ఒక రోజు.

మీరు.

ఒక notebook.

ఒక pen.

కొన్ని గంటలు phone లేకుండా.

అవకాశముంటే కొన్ని గంటలు AI కూడా లేకుండా.

AI ని నేను చాలా ఉపయోగిస్తాను. అది అద్భుతమైన tool.

కానీ ప్రతి ప్రశ్నకు వేగంగా answer రావడం అవసరం లేదు.

కొన్ని ప్రశ్నలు మనలో కొంతసేపు ఉండాలి.

ఉదయం మీకు మీరు అడగండి:

“నేను చాలా కాలంగా సహిస్తూ వచ్చిన చిన్న అసంతృప్తి ఏమిటి?”

పెద్ద tragedy కాదు.

మీరు ఎప్పుడూ complaint చేస్తూ, కానీ మార్చకుండా వదిలేసిన విషయం.

చూసుకోవాలని అనుకుంటున్న body.

మాట్లాడాలని అనుకుంటున్న person.

రాయాలని అనుకుంటున్న book.

Mechanical గా మారిపోయిన relationship.

Meaning కోల్పోయి routine గా మారిపోయిన work.

పదేళ్లుగా కారుతున్న tap లాగా, చివరకు ఆ శబ్దం కూడా వినిపించకుండా పోయిన సమస్య.

గత ఏడాది మీరు ఎక్కువగా complaint చేసిన మూడు విషయాలు రాయండి.

తర్వాత ఒక ప్రశ్న:

“నా మాటలు వినకుండా, నా actions మాత్రమే ఒకరు చూస్తే — నాకు నిజంగా ముఖ్యమైనది ఏమిటని అనుకుంటారు?”

ఈ ప్రశ్న కొంచెం uncomfortable గా ఉండవచ్చు.

పర్వాలేదు.

కొన్ని ప్రశ్నలు అలా ఉండాలి.

ఐదేళ్ల తర్వాత ఒక సాధారణ మంగళవారం

ఏమీ మారలేదని ఊహించండి.

ఐదేళ్ల తర్వాత ఒక ordinary Tuesday.

ఎక్కడ నిద్రలేస్తున్నారు?

మీ body ఎలా ఉంది?

లేవగానే మొదట ఏది చేతిలోకి తీసుకుంటున్నారు?

మీ పక్కన ఎవరు ఉన్నారు?

ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఏమి చేస్తున్నారు?

ఏం postpone చేస్తున్నారు?

రాత్రి 10 గంటలకు, ఎవరికీ మీ అవసరం లేని సమయంలో, మీలో ఏమి మిగిలింది?

ఇప్పుడు మరో ఐదేళ్లు ముందుకు వెళ్లండి.

ఏ doors మూసుకుపోయాయి?

ఎవరు మిమ్మల్ని పిలవడం మానేశారు—ఎందుకంటే మీరు ప్రతిసారీ “తర్వాత” అన్నారు?

ఏ skill నేర్చుకోలేదు?

ఏ friendship తనంతట అదే నిలబడుతుందని అనుకున్నారు?

మీ గత decade habits కి మీ body ఇప్పుడు ఏ bills పంపుతోంది?

ఇది pessimism కాదు.

ఇది trajectory.

Pediatrics లో ఒక weight మనకు ఒక సమాచారం ఇస్తుంది.

Serial weights ఇంకో గొప్ప సమాచారం ఇస్తాయి.

ఒక measurement:

పిల్లవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెబుతుంది.

Growth curve:

పిల్లవాడు ఎటు వెళ్తున్నాడో చెబుతుంది.

మన జీవితాలకు కూడా growth charts అవసరమేమో.

“నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను?”

అనే ప్రశ్న మాత్రమే కాదు.

“ఈ curve ఇలాగే కొనసాగితే నేను ఎక్కడికి చేరతాను?”

Anti-Vision కూడా అవసరం

Vision గురించి మనం చాలా మాట్లాడుతాం.

కానీ anti-vision కూడా అవసరం.

భయపెట్టుకోవడానికి కాదు.

Boundary తెలుసుకోవడానికి.

మీకు మీరు అడగండి:

“నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ జీవితంలోకి నెమ్మదిగా జారిపోకూడదు?”

Résumé మెరుగవుతూ health చెడిపోయిన జీవితం?

మీ profession గురించి మీ పిల్లలకు ఎక్కువగా తెలుసు కానీ, మీ గురించి తక్కువగా తెలిసిన జీవితం?

Financially secure కానీ intellectually asleep అయిన జీవితం?

Reputation కాపాడుకోవడంలోనే కొత్తది ప్రయత్నించలేని జీవితం?

Important person అవ్వడంలో బిజీగా ఉండి, interested person గా ఉండటం మర్చిపోయిన జీవితం?

దాన్ని ఒక sentence లో రాయండి.

Instagram కోసం కాదు.

ఎవరికీ చూపించడానికి కాదు.

మీ కోసం.

ఇప్పుడు మీరు నిజంగా కోరుకునే Tuesday ని ఊహించండి

మూడు సంవత్సరాల తర్వాత.

Award function కాదు.

మీరు famous అయిన రోజు కాదు.

అందరూ clap చేస్తున్న photograph కాదు.

ఒక ordinary Tuesday.

ఎక్కడ నిద్రలేస్తారు?

మీ సమయం మీద మీకు ఎంత control ఉంది?

మీ body ఏం చేయగలుగుతోంది?

ఏ పని మీ attention తీసుకుంటోంది?

ఏం నేర్చుకుంటున్నారు?

ఏం నిర్మిస్తున్నారు?

మీ పని వల్ల ఎవరికి ఉపయోగం?

ఎవరికి మీ సమయం ఉంది?

రాత్రి పడుకునేటప్పుడు,

“ఈ రోజు వృథా కాలేదు”

అని అనిపించడానికి ఏమి జరిగి ఉండాలి?

ఇది final vision కావాల్సిన అవసరం లేదు.

మీరు final కాదు.

ప్రపంచం final కాదు.

Compass direction చూపిస్తుంది.

ప్రతి అడుగు ఎక్కడ వేయాలో చెప్పదు.

Autopilot ని మధ్య మధ్యలో ఆపండి

ఉదయం reflection చాలా సులభం.

తర్వాత life మొదలవుతుంది.

Phone మోగుతుంది.

Messages వస్తాయి.

Meetings మొదలవుతాయి.

Patients ఎదురుచూస్తారు.

Lunch ఆలస్యమవుతుంది.

ఉదయం 6 గంటలకు ఉన్న philosopher, సాయంత్రానికి కనిపించడు.

పాత operating system మళ్లీ control తీసుకుంటుంది.

అందుకే రోజులో కొన్ని alarms పెట్టుకోండి.

Tasks కోసం కాదు.

Questions కోసం.

11:00 AM
నేను ఇప్పుడు చేస్తున్న పని ద్వారా దేనిని avoid చేస్తున్నాను?

1:30 PM
గత రెండు గంటలు video తీసి ఎవరైనా చూస్తే, నాకు జీవితంలో ముఖ్యమైనది ఏమిటని అనుకుంటారు?

3:15 PM
నేను కోరుకునే జీవితం వైపు వెళ్తున్నానా? లేక అలవాటైపోయిన జీవితంలోకి మరింత లోతుగా వెళ్తున్నానా?

5:00 PM
చాలా ముఖ్యమైనదాన్ని ముఖ్యమైనది కాదని నేను నటిస్తున్నానా?

7:30 PM
ఈరోజు నేను నిజంగా కోరుకుని చేసినవి ఏమిటి? నా identity కాపాడుకోవడానికి చేసినవి ఏమిటి?

9:00 PM
ఈరోజు నేను ఎప్పుడు అత్యంత alive గా అనిపించాను? ఎప్పుడు నా జీవితంలో నేనే లేనట్టు అనిపించింది?

Answers ని judge చేయకండి.

Observe చేయండి.

ICU monitor saturation పడిపోయినప్పుడు patient ని తిట్టదు.

అది information చూపిస్తుంది.

ఎవరైనా చూస్తున్నందుకే ఆ information ఉపయోగపడుతుంది.

Self-awareness అంటే బహుశా మన monitors ని మనమే చూడటం నేర్చుకోవడం.

జీవితాన్ని చిన్న time frames లో చూడండి

“నా జీవితాన్ని మార్చాలి”

అనేది చాలా పెద్ద sentence.

అందుకే time ని చిన్నది చేయండి.

ఒక సంవత్సరం:
పాత pattern నిజంగా విరిగిపోయిందని చెప్పడానికి ఒక concrete evidence ఏమిటి?

ఒక నెల:
ఆ one-year possibility alive గా ఉండాలంటే ఈ నెలలో ఏమి జరగాలి?

రేపు:
నేను మారాలనుకుంటున్న వ్యక్తి సహజంగా చేసే రెండు లేదా మూడు పనులు ఏమిటి?

27 habits అవసరం లేదు.

రెండు లేదా మూడు.

Rudder ఓడతో పోలిస్తే చాలా చిన్నది.

కానీ దాన్ని కొన్ని degrees తిప్పి అలాగే ప్రయాణిస్తే—

చివరకు మరో continent చేరతాం.

మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అన్నదానికంటే — ఏం కోల్పోవడానికి సిద్ధంగా లేరు?

Health?

Family?

Integrity?

Sleep?

Curiosity?

Peace?

Freedom?

ఆలోచించడానికి సమయం?

కొంతమంది కోరుకున్నదంతా సంపాదిస్తారు.

కానీ దాన్ని ఎందుకు సంపాదించాలనుకున్నారో—అదే కోల్పోతారు.

Constraints weakness కాదు.

Music కి rhythm ఉంది.

Game కి rules ఉన్నాయి.

Architecture కి gravity ఉంది.

Boundaries creativity ని చంపవు.

కొన్నిసార్లు అవే meaningful creativity ని సృష్టిస్తాయి.

అందుకే,

“నేను ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నాను?”

అనే ప్రశ్నతో పాటు,

“దాన్ని సాధించడానికి నేను ఎలాంటి మనిషిగా మాత్రం మారను?”

అని కూడా అడగాలి.

మన చేతిలో మొత్తం కథ ఉండదు

Self-help literature లో నాకు నచ్చని ఒక exaggeration ఉంది.

“నువ్వు నిజంగా కోరుకుంటే ఏదైనా సాధించగలవు.”

జీవితం అంత సులభం కాదు.

Biology ఉంది.

Disease ఉంది.

Accidents ఉన్నాయి.

History ఉంది.

Economic circumstances ఉన్నాయి.

ఇతర మనుషులకు కూడా agency ఉంది.

Timing ఉంది.

Opportunity ఉంది.

Luck కూడా ఉంది.

Hospitals లో చాలాకాలం గడిపినవారికి ఒక విషయం తెలుసు.

చాలా జాగ్రత్తగా plan చేసిన జీవితం కూడా ఒక laboratory report, ఒక scan, ఒక phone call, లేదా road మీద కొన్ని seconds వల్ల పూర్తిగా తిరిగి రాయబడవచ్చు.

Agency నిజం.

Control limited.

ఈ రెండు ఒకేసారి నిజం కావచ్చు.

మన చేతిలో ప్రతి outcome ఉండకపోవచ్చు.

కానీ చాలా సందర్భాల్లో ఒక అద్భుతమైన freedom మన దగ్గర ఉంటుంది.

తర్వాతి response ఎంచుకునే స్వేచ్ఛ.

Freedom అంటే మొత్తం కథను control చేయడం కాకపోవచ్చు.

తర్వాతి sentence ని మనమే రాయడం మొదలుపెట్టే చోట freedom ఉండవచ్చు.

ఖాళీ పేజీ

జీవితం ఒక కథ అనే metaphor నాకు ఎప్పటినుంచో ఇష్టం.

మొదటి chapters అన్నీ మనం రాయము.

కొన్ని parents రాస్తారు.

కొన్ని biology రాస్తుంది.

కొన్ని culture రాస్తుంది.

కొన్ని history రాస్తుంది.

Chance మధ్యలో margins లో ఏదో రాసేస్తుంది.

ఇతర మనుషులు మన కథలోకి వచ్చి, మన permission లేకుండానే కొన్ని chapters మార్చేస్తారు.

మనకు నచ్చని pages కూడా ఉంటాయి.

కొన్నింటిని erase చేయలేం.

కొన్నింటిని explain కూడా చేయలేం.

కానీ మనం మర్చిపోయే ఒక విషయం ఉంది.

Pen ఇంకా మన చేతిలోనే ఉంది.

Previous chapter, next chapter ని constrain చేయవచ్చు.

కానీ పూర్తిగా రాయదు.

Yesterday evidence.

Command కాదు.

Next sentence ఇంకా రాయబడలేదు.

మనం ఏదో రాస్తాం.

తప్పు అని తెలుస్తుంది.

నేర్చుకుంటాం.

సరిచేస్తాం.

మళ్లీ రాస్తాం.

Recalculating...

Perfect అవ్వడం కాదు.

ప్రతి outcome ని control చేయడం కాదు.

ప్రతి game గెలవడం కాదు.

గమనించగలగడం.

ప్రశ్నించగలగడం.

తప్పు అయితే సరిచేసుకోగలగడం.

కొత్తది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం.

అవసరమైతే direction మార్చగలగడం.

అయితే ఒక్క రోజులో జీవితం మారుతుందా?

లేదు.

అవును కూడా.

రేపు ఉదయం మీ body అలాగే ఉండవచ్చు.

Bank balance మారకపోవచ్చు.

Job title అదే ఉంటుంది.

Unfinished work అక్కడే ఉంటుంది.

మీ చుట్టూ ఉన్నవారికి ఏ మార్పూ కనిపించకపోవచ్చు.

కానీ ఒక ఓడ rudder కొన్ని seconds లో తిరుగుతుంది.

Harbour వెంటనే మారదు.

Ocean మారదు.

Ship ఒక్కసారిగా మరోచోటికి వెళ్లదు.

తీరంలో నిలబడి చూస్తున్నవారికి చాలా సేపు ఏ మార్పూ కనిపించకపోవచ్చు.

కానీ rudder తిరిగిన క్షణం నుంచి—

Destination మారడం మొదలైంది.

బహుశా ఒక రోజు మన జీవితాన్ని పరిశీలించుకోవడం వల్ల వచ్చే గొప్ప మార్పు transformation కాదు.

Orientation.

మన ముఖం ఎటు తిరిగి ఉందో తెలుసుకోవడం.

కొన్నిసార్లు అంతే చాలు.

ఒక తెల్ల కాగితం తీసుకోండి.

Phone పక్కన పెట్టండి.

రెండు ప్రశ్నలు రాయండి.

నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే కొనసాగితే — చివరకు ఎక్కడికి చేరతాను?

నేను నిజంగా ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాను?

Answers వెంటనే రాకపోతే పర్వాలేదు.

కొన్ని questions కి గొప్పతనం వాటి answers లో ఉండదు.

అవి మనల్ని వదలకుండా వెంటపడటంలో ఉంటుంది.

Answer వచ్చినప్పుడు దాన్నీ ప్రశ్నించండి.

ప్రశ్న అడుగుతున్న మనిషినీ ప్రశ్నించండి.

ఎందుకంటే జీవిత దిశను మార్చేది ఎప్పుడూ ఒక గొప్ప answer కాకపోవచ్చు.

సరైన సమయంలో మనకు మనమే వేసుకున్న ఒక ప్రశ్న కావచ్చు.

ఆ ప్రశ్న నుంచి చూపు తిప్పకుండా ఉండే ధైర్యం కావచ్చు.


ఒక చిన్న కృతజ్ఞత

ఈ వ్యాసానికి ఆలోచనను ఇచ్చింది అమెరికన్ రచయిత, digital creator మరియు entrepreneur Dan Koe రాసిన “How to Fix Your Entire Life in 1 Day” అనే వ్యాసం.

Dan Koe తన రచనల్లో human potential, identity, lifestyle design, creativity, internet-era work వంటి విషయాల గురించి ఎక్కువగా రాస్తారు. ఆయన The Art of Focus రచయిత, Eden సహ వ్యవస్థాపకుడు కూడా.

ఆయన వ్యాసంలోని identity, anti-vision, feedback, conscious interruption, life-design వంటి ఆలోచనలు ఈ రచనకు starting point మాత్రమే. వాటిని medicine, learning, uncertainty, responsibility, freedom, మరియు నా జీవితాన్ని నేను చూసే విధానం నుంచి ఇక్కడ విస్తరించి, కొన్ని చోట్ల ప్రశ్నించి, నా మాటల్లో చెప్పడానికి ప్రయత్నించాను.

— డా. బి. ఎస్. చక్రవర్తి

Inspired by Dan Koe’s How to Fix Your Entire Life in 1 Day.

Comments

Popular posts from this blog

Time-Restricted Eating: Giving the Body Time to Heal*

కాలం, కొలత, మరియు కనిపించని విశ్వ క్రమం మనకు అనిపిస్తున్నది నిజమా… లేక అది కేవలం ఒక ప్రతిబింబమా?